Musi River : మూసీ నిర్వాసితులకు16 వేల ఇండ్లు .. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Musi River : మూసీ నిర్వాసితులకు16 వేల ఇండ్లు .. జీవో జారీ చేసిన ప్రభుత్వం
X

మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం అత్తాపూర్‌ వద్ద మూసీ నదిలో నిర్మాణాలను ఆర్డీవో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు మూసీ నదిపై ఉన్న అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలు సేకరిస్తున్నారు. పనులను ప్రారంభించేందుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 16 వేల ఇళ్లను మూసీ నిర్వాసితులకు ఇచ్చేలా మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొన్ని నెలలుగా 3 జిల్లాల పరిధిలోని మూసీ నదిపై సర్వే జరిగింది. రెవెన్యూ అధికారులు నదిగర్భంలో, బఫర్‌జోన్‌లో 10,200 నిర్మాణాలను గుర్తించారు. వాటిలో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు బుధవారం నుంచి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా మరో కీలక ముందడుగు వేసింది. గోల్నాక, చాదర్ ఘాట్, మూసారంబాగ్ లో ఉన్న ఆక్రమణలను తొలగిచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ శని, ఆదివారాలలో మూసీ నది ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో ఉన్న ఇళ్లను మార్క్ చేసిన హైడ్రా.. ఈ క్రమంలో 1350 మందికి తాజాగా హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ మూసీ నివాసిత ప్రాంతాలకు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు వెళ్లనున్నారు. అక్కడ ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా వారితో చర్చలు జరపనున్నారు.

Tags

Next Story