Harish Rao : హైదరాబాద్ వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: సీఎంపై హరీశ్‌రావు ఫైర్..

Harish Rao : హైదరాబాద్ వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: సీఎంపై హరీశ్‌రావు ఫైర్..
X

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం జలమయం కావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదని, ఇది నేరపూరిత నిర్లక్ష్యం అని ఆయన ఘాటుగా ఆరోపించారు.

ముందస్తు హెచ్చరికలు ఉన్నా చర్యలు లేవు:

వాతావరణ శాఖ ముందుగానే తీవ్ర వర్షాలు కురుస్తాయని హెచ్చరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. వరద తీవ్రతను అంచనా వేయడంలో సరైన ప్రణాళికలు రచించడంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని విమర్శించారు.

బస్టాండ్‌లో ప్రయాణికుల ఇక్కట్లు:

ప్రభుత్వ ముందుచూపు లోపం వల్లే పండుగ వేళ ఊళ్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎంజీబీఎస్ బస్టాండులో వరద నీటిలో చిక్కుకుని రాత్రంతా భయంతో గడపాల్సి వచ్చిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

సహాయక చర్యలపై దృష్టి పెట్టండి:

ప్రస్తుతం మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బురద రాజకీయాలను కాసేపు పక్కనపెట్టి, తక్షణమే సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

హరీశ్‌రావు డిమాండ్లు.. వరదల్లో చిక్కుకున్న ప్రయాణికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మూసీ పరిసర ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రజలను గుర్తించి, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించి భరోసా కల్పించాలి.

ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story