సర్పంచ్ ఎన్నికలు షురూ.. ఎమ్మెల్యేల పెత్తనం తగ్గించాలి.

సర్పంచ్ ఎన్నికలు షురూ.. ఎమ్మెల్యేల పెత్తనం తగ్గించాలి.
X

గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నో వాయిదాల తర్వాత చిట్ట చివరకు ఎన్నికలు జరగబోతున్నాయి. నేటి నుంచి మొదటి విడత నామినేషన్లు షురూ అవుతున్నాయి. అయితే ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఈమధ్య కాలంలో ఎమ్మెల్యేల పెత్తనం మరీ ఎక్కువైపోయింది. ఏ పార్టీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ స్థాయి నేతలు చెప్పిన వారే పార్టీ తరఫున సర్పంచ్ బరిలో నిలబడుతున్నారు. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలతో పార్టీలకు, పార్టీల గుర్తులతో సంబంధమే లేదు. కానీ అనధికారికంగా ఒక గ్రామంలో ఒక పార్టీ తరఫున ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చి అతనికే ఆ పార్టీ మొత్తం సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఈ రకమైన పద్ధతిలో ఎమ్మెల్యేలదే పూర్తి పెత్తనం అయిపోయింది.

ఎమ్మెల్యే చెప్పిన వారే పార్టీ మద్దతుతో సర్పంచ్ ఎన్నికల్లో నిలబడుతున్నారు. దీంతో గ్రామాలు కూడా పార్టీల పరంగా విడిపోతున్నాయి. ఒకప్పుడు సర్పంచ్ అంటే గ్రామం మొత్తానికి అన్నట్టు ఉండేవాడు. అందరితో కలివిడిగా ఉంటూ అందరినీ కలుపుకుపోయేవాడు. కానీ ఇప్పుడు సర్పంచ్ అంటే ఫలానా పార్టీ అభ్యర్థి అన్నట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం కూడా ఎమ్మెల్యేలు అనే చెప్పాలి. ఎమ్మెల్యేలు వచ్చి తమ పార్టీ అభ్యర్థి అంటూ గ్రామాల్లో ప్రచారం చేయటం వల్ల.. సర్పంచులపై పార్టీల ముద్ర పడిపోతుంది. ఇలా చేయటం వల్ల సర్పంచులకు గ్రామంపై పూర్తిస్థాయిలో పట్టు రావట్లేదు. సర్పంచ్ ఎన్నికలకు పార్టీ గుర్తులను పక్కన పెట్టడానికి కారణం గ్రామాల్లో ఐక్యతను నెలకొల్పడం కోసమే.

కానీ గత పదేళ్లుగా ఈ రకమైన ఎమ్మెల్యేల పెత్తనం గ్రామాల్లో ఎక్కువైపోతుంది. ఈసారి ఎన్నికల్లో అలాంటి పరిస్థితికి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు గ్రామాల ప్రజలు. ఎందుకంటే ఒక గ్రామం లో ఏ సమస్య ఉన్నా సరే సర్పంచ్ దగ్గరికి వెళ్లి అందరూ చెప్పుకునే పరిస్థితి ఉండాలి. ఒక ఎమ్మెల్యే సదరు గ్రామానికి వెళితే ముందుగా సర్పంచ్ తో మాట్లాడి సమస్యలు తెలుసుకుని గ్రామానికి కావాల్సిన నిధులను ఇవ్వాలి. కానీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్తే తమ పార్టీకి చెందిన వ్యక్తి సర్పంచ్ అయితే ఒక రకంగా ఇంకో పార్టీకి చెందిన వ్యక్తి సర్పంచిగా ఉంటే ఇంకోరకంగా వ్యవహరించడం గ్రామాలకు మంచిది కాదు. ఒక సర్పంచ్ గెలిచేది పార్టీ గుర్తుపై కాదు కాబట్టి సర్పంచ్ కు పార్టీ ముద్ర పడకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉంది. మరి దీనికి మార్పు ఈసారి అయినా మొదలవుతుందా లేదా చూడాలి.

Tags

Next Story