జూన్ గడుస్తున్నా కరుణించని వరుణుడు..!

సగం జూన్ నెల గడిచినా దేశంలో ఇప్పటికీ వర్షాల జాడ లేదు. వానలు సంగతి అటుంచితే ఇంకా ఎండల వేడి తగ్గనేలేదు. పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు.దేశవ్యాప్తంగా విస్త్రృతంగా వానలు కురిపించి భారత్ లోని అనేక ప్రధాన ప్రాజెక్టుల్లో, జలశయాల్లో నీటిని నింపే నైరుతి రుతుపవనాలు ఇప్పటకీ దూరంగానే ఉండటం కలవరపెడుతున్న అంశం.సౌత్ వెస్ట్ మాన్ సూన్ సీజన్ మొదలైనా వానలు మాత్రం ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉండటం ప్రజలను ఉక్కరిబిక్కిరి చేస్తోంది.
ప్రభుత్వ రంగ వాతావరణ సంస్థ IMD అంచనా తప్పింది.సాధారణంగా జూన్1 న రావాల్సిన నైరుతి రుతుపవనాలు జూన్8న కేరళను తాకాయని చెప్పిన IMD రైతులకు కచ్చితమైన సమాచారం అందించడంలో మాత్రం విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి.అటు నైరుతి పై ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ బాంబు పేల్చింది. దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రభావం నాలుగు వారాల వరకు అంతగా ఉండదని తెలిపింది.ఈ సీజన్‌లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వ్యవసాయంపై అధాపడే రైతులకు ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేసింది. ప్రకారం జూలై 6 వరకు వర్షాలు కురిసే అవకాశం తక్కువని స్కైమెట్ అంచనా వేసింది.వర్షాధార వరి పంట వేసే రైతులకు సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.మధ్య,పశ్చిమ భారత్ ప్రాంతాల్లోని రైతులు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొవచ్చని తెలిపింది.
మరోవైపు గుజరాత్తీరంలో ఏర్పడిన బిపర్జోయ్తుపాన్వల్ల రుతుపవనాలు లేట్ గా వచ్చినట్లు తెలిపింది. రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా లేవని.. మందకొండిగా కదులుతున్నాయని వివరించింది. రుతుపనాలు నెమ్మదిగా కదిలితే.. మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్,బిహార్ లో జూన్20 వరకు కూడా నైరుతి చేరుకోవడం కష్టమని తెలిపింది.బంగాళాఖాతంలో అల్పపీడనాలు వస్తే రుతుపవనాల్లో వేగం పెరగొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com