మీది తప్పు అయితే..ముక్కు నేలకు రాయాలి..లేదంటే నేను రాజీనామా చేస్తా:హరీష్

మీది తప్పు అయితే..ముక్కు నేలకు రాయాలి..లేదంటే నేను రాజీనామా చేస్తా:హరీష్

దుబ్బాకలో ప్రచారం హోరెత్తుతోంది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, దివంగత రామలింగారెడ్డి సతీమణి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.. దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించిన ఆమె.. రామలింగారెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారని.. తననూ ఆశీర్వదించాలని దుబ్బాక ప్రజలను కోరారు. రామలింగారెడ్డి ప్రజల మనసులో ఉన్నారని ఆమె అన్నారు. ప్రజల కష్టాలను తీర్చడంలో ఎప్పుడూ ఆయన ముందుండేవారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేసేవారన్నారు.. మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని సోలిపేట సుజాత తెలిపారు.

సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రఘునందన్‌రావుకు పెద్ద చెప్యాల గ్రామంలో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా దుబ్బాక ప్రజలు లొంగరని, తనకు అవకాశం ఇస్తే దుబ్బాక రూపురేఖలు మార్చి చూపిస్తానని రఘునందన్‌రావు చెప్పారు. ఎన్నడూ రాని హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఎన్నికల ముందు దుబ్బాకకు పదేపదే వస్తున్నారని నిప్పులు చెరిగారు. నిరుద్యోగులకు ఆరేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

అటు బీజేపీ చేస్తున్న విమర్శలను మంత్రి హరీష్‌రావు తిప్పికొట్టారు. దుబ్బాక ఎన్నికల్లో తామెవరినీ టార్గెట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెన్షన్లపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మీది తప్పు అయితే.. ముక్కు నేలకు రాయాలని.. లేదంటే తాను రాజీనామా చేస్తానని ఛాలెంజ్‌ విసిరారు. బీజేపీ పుకార్ల పుట్ట.. అబద్దాల గుట్ట అంటూ హరీష్‌రావు నిప్పులు చెరిగారు. ఇంకా రాని కరోనా వ్యాక్సిన్‌ను.. ఉచితంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌తోనే వున్నారని హరీష్‌రావు ధీమాగా చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story