Telangana : రేషన్ కార్డ్ రశీదు తీసుకున్నారా?

కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల్లో చేసిన దరఖాస్తు రశీదును ఎక్కడా సమర్పించాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. మీసేవ దరఖాస్తు రశీదు విషయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో బుధవారం పౌరసర ఫరాల శాఖ స్పందించింది. మీసేవలో దరఖాస్తు చేసిన రసీదును భద్రపరుచుకోవాలని సూచించింది. రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని తెలిపింది. రేషన్ కార్డ్ కోసం దరఖాస్తులకు నిర్దేశిత గడువు ఏమీ లేదని, దరఖాస్తుదారులు తొందర పడాల్సిన అవసరం లేదని తెలిపింది. కులగణన, ప్రజాపాలన, ప్రజావాణిలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని మరోమారు స్పష్టత ఇచ్చింది. అయితే మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటికి సంబంధించిన రశీదును పౌరసరఫరాల శాఖ కార్యాలయం లేదా తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని మీ సేవ నిర్వాహకులు సూచిస్తున్నారు. దీంతో దరఖాస్తు రశీదులను పట్టుకుని సివిల్ సప్లయ్ కార్యాలయాలకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. అక్కడా గంటలతరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోందని, ఆన్లైన్లో అప్లయ్ చేశాక మళ్లీ ఫిజికల్గా రశీదులు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com