బడులు తెరవండి.. భద్రతలు పాటించండి.. : వైద్యశాఖ

కోవిడ్ మహమ్మారి పిల్లల్ని ఇంటికే పరిమితం చేసింది. ఆన్‌లైన్ చదువులు.. వచ్చిన నాలుగు ముక్కలు కూడా పోతున్నాయని తల్లిదండ్రుల ఆవేదన. అయినా మరో పక్క బడికి పంపించాలంటే భయపడతున్నారు తల్లిదండ్రులు. అసలే శుభ్రత కొరవడిన పాఠశాలలు. అతి శుభ్రత, అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో బడికి పంపిస్తే పిల్లల ఆరోగ్యం ఏమవుతుందో అని ఆందోళన.. ఎన్నాళ్లు ఇంట్లో చదువులు.. ఇకనైనా బడి తెరిస్తే బావుండు అని మరోపక్క పిలల్లలతో పాటు అమ్మానాన్న ఆశపడుతున్నారు.
అదే సమయంలో వైద్య శాఖ కూడా బడులు తెరవమని భరోసా ఇస్తోంది. ఇప్పటికే అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎక్కువ శాతం మంది కనీసం ఒక డోసైనా తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ పాఠశాలలు, కళాశాలలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతోంది. ఈ మేరకు విద్యాశాఖకకు తమ అంగీకారాన్ని తెలిపినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలో ఈ విషయంపై ఉన్నతాధికారుల సలహా తీసుకుని విద్యాసంస్థలు ప్రారంభించడంపై ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య దాదాపుగా తగ్గుముఖం పట్టింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దాదాపు ఏడాదిన్నర కాలంగా బడికి దూరంగా ఉన్న పలువురు విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ ప్రభావం తల్లిదండ్రులపైన కూడా పడుతోందని వైద్య వర్గాలు తెలిపాయి.
ఆన్‌లైన్ విద్యవల్ల విద్యార్థుల మనోవికాసం దెబ్బతింటోందని, ఎలక్ట్రానిక్ గ్యాడెట్లతో కాలం గడుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరగతుల్లో నిత్యం శానిటైజేషన్ నిర్వహించాలి. తరగతి గదుల్లో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. విద్యార్థులు సురక్షిత దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల అని వైద్య శాఖ విద్యాశాఖకు సూచించినట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com