Heavy Rain : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి మంగళవారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్ష సూచన..
ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రాజెక్టులకు భారీగా వరద..
భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. నాగార్జున సాగర్ జలాశయానికి 3,70,309 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి 3,98,660 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 73.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు 39 గేట్ల ద్వారా 2.32 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com