Heavy Rains : ఖమ్మం జిల్లాలో భారీవర్షాలు.. రైతుల రెస్క్యూ సక్సెస్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు నిండి ప్రవహిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు 24వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో దిగువ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
బచ్చువారిగూడెం గ్రామం వద్ద పెదవాగు నుండి వరద నీరు రావడంతో వంతెనపై సుమారు 30 మంది కూలీలు, గ్రామస్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. బాధితులు ఆర్తనాదాలు చేయడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. విషయాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చేరవేయగా, వెంటనే స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ రంగంలోకి దింపి కూలీలను సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రాణనష్టం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
మరో చోట చెట్లు ఎక్కి ఉన్నవారిని కూడా హెలికాప్టర్ బృందాలు కాపాడడంతో ప్రాణనష్టం తప్పింది. దమ్మపేట మండలంలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. జమేదారు బంజర గ్రామంలో గురువారం ఉదయం పిడుగు పాటుకు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com