Heavy Rain : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

Heavy Rain : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
X

ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అది వాయుగుండంగా మారి.... రేపు తీరాన్ని దాటే అవకాశం ఉందని... వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ర్టంలో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు... అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని వెల్లడించారు.

హైదరాబాద్ నగరాన్ని వానలు వదిలేలా లేవు. నేడూ నగర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొద్ది పాటి విరామం ఇస్తూ... కురుస్తున్న వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో హైదరాబాద్ లోని జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. పోటెత్తతున్న వరదతో హిమాయత్ సాగర్ , ఉస్మాన్ సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోడకూలి ఓ మహిళ మృతి చెందగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనూ ఇంటి గోడ కూలింది. వివిధ జిల్లాల్లో...దంచికొట్టిన వానలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి నిలిచిపోయింది.

Tags

Next Story