Loan Waiver : మిగతా రెండు దశల రుణమాఫీ ఎలా చేస్తారంటే!

Loan Waiver : మిగతా రెండు దశల రుణమాఫీ ఎలా చేస్తారంటే!
X

ఆగష్టు 15లోగా పూర్తి స్థాయిలో రుణమాఫీకి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. మొదటిదశమాఫీ రూ.లక్ష రుణాల మాఫీకి రూ.7వేలకోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా రెండో విడత రూ.1.5లక్ష మేర రుణాలను మాఫీ చేయనుంది. అందుకు వీలుగా రూ. 8వేలకోట్లను రెడీ చేస్తోంది. ఇక మూడో విడత ఆగష్టు 15లోగా చేయనుంది. ఇందుకు రూ. 15 వేలకోట్లు అవసరమని అంచనా వేశారు.

తొలి విడతకు సులువుగా నిధులను సమీకరించిన ప్రభుత్వం రెండు, మూడో విడతలకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనా సంస్థకు చెందిన భూములను అభివృద్ధి చేసి కుదువ పెట్టడం ద్వారా రూ. 10వేల కోట్లను సమీకరించుకోవాలని నిర్ణయించింది. మర్చంట్ బ్యాంకులనుంచి రుణాలకు గానూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజలు జారీ చేసింది. రాష్ట్రంలోని డీసీసబీలు, ప్యాక్స్ కు మూలధనం సమకూర్చి బలోపేతం చేసుకుంటామని జాతీయ సహకార అభివృద్ధి సంస్థనుంచి రూ. 5వేల కోట్ల రుణాలకు టెస్కాబ్ యత్నిస్తోంది. మద్యం డిస్టిలరీలు, బ్రూవరీలకు చెల్లించాల్సిన బకాయిలకు రెడీగా ఉంచిన నిధులను రుణమాఫీకి మళ్లించనున్నారు.

రైతు భరోసాకు చెల్లించాల్సిన నిధులను కూడా ప్రస్తుతానికి రుణమాఫీకే వెచ్చించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకు వీలుగా ఆర్ధక శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని రైతులదరికీ రెండు లక్షలల్లోపు రుణాలను మాఫీ చేయాలంటే రూ.31,000ల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని మొదట్లో ప్రభుత్వం అంచనా వేసింది.

Tags

Next Story