టీఆర్‌ఎస్‌లోకి జోరందుకుంటున్న వలసలు

దుబ్బాక ఉప సమరం తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది.. గెలుపు కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.. అభివృద్ధి నినాదంతో టీఆర్‌ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంటే, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళ్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతున్నాయి.
మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌లోకి వలసలు జోరందుకుంటున్నాయి.. విపక్ష పార్టీల నుంచి నేతలు టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు.. మంత్రి హరీష్‌రావు సమక్షంలో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కారెక్కుతున్నారు.. తాజాగా రాష్ట్ర బీజేపీ దళిత మోర్చా కౌన్సిల్ మెంబర్‌తోపాటు 150 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్‌రావు. దుబ్బాకకు సీఎం కేసీర్ సముద్రమంత సాయం చేస్తే.. బీజేపీ కాకిరెట్టంత సాయం చేసిందన్నారు హరీష్ రావు. సోషల్ మీడియాలో బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారానికి, నోబెల్ బహుమతి ఇవ్వాలి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాకు వస్తే వాళ్ల మైకులే మూగబోయాయి అంటూ ఎద్దేవ చేశారు. పరాయి లీడర్లు.. పరాయి కార్యకర్తలతో కాంగ్రెస్ మీటింగ్‌లు నడుస్తున్నాయని.. ప్రజలు అసలే లేరన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు దుబ్బాక మారెమ్మ గుడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. తరువాత తెలంగాణ సర్కిల్ దగ్గర సభ నిర్వహించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. తెలంగాణను, దుబ్బాకను దారుణంగా వంచించిన ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ఈ ఉప ఎన్నిక అందివచ్చిన అవకాశంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
దుబ్బాకలో ముత్యం రెడ్డిపై ఉన్న సానుభూతి తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.. చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అందరినీ కలుపుకుని పోవాలని, లేకుంటే ఇబ్బంది తప్పదనే అభిప్రాయాన్ని సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.. ఇన్‌ఛార్జ్ చెప్పినా కొందరు నేతలు స్థానికంగా ఉండలేకపోతున్నారని.. కాంగ్రెస్ నేతలు కష్టపడుతున్నా ఫలితం మాత్రం జనం చేతిలో ఉంటుందని పార్టీ సీనియర్ నేత వీహెచ్ అన్నారు.
మరోవైపు దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన రఘునందన్ రావు.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇంటింటికీ వెళ్లి బీజేపీకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.. దుబ్బాకను నిర్లక్ష్యం చేస్తూ సీఎం, కొడుకు, అల్లుడు దోపిడీ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. దమ్ముంటే సీఎం దుబ్బాక వచ్చి తాము చెప్పింది అబద్ధాలు అని నిరూపించలని సవాల్ విసిరారు. దుబ్బాకలో ఎన్ని ఆటంకాలు సృష్టించినా రఘునందన్ గెలుపు ఖాయమని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
మొత్తం మీద దుబ్బాకలో త్రిముఖ పోరు నడుస్తోంది.. అయితే, విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్‌ఎస్ నేతలు.. సెకండ్ ప్లేస్ కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com