Telangana Municipal Polls : మున్సిపాలిటీల్లో హంగ్.. స్వతంత్రులే కింగ్ మేకర్లు..

తెలంగాణలో తాజాగా రిలీజ్ అయిన 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ ల ఫలితాల్లో భిన్నమైన రిజల్ట్ కనిపించింది. చాలా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటం షాకింగ్ గా మారింది. దాదాపు 28 మున్సిపాలిటీలో ఎవరికీ మెజారిటీ రాలేదు. కొన్నిచోట్ల బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమాన స్థానాలు వచ్చాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉంటే.. ఇంకొన్ని చోట్ల బిఆర్ఎస్ ఆధిపత్యంలో ఉంది. దీంతో ముందు వచ్చిన మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థుల కోసం రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రెండు పార్టీలు. దీంతో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులకు ఫుల్ డిమాండ్ అయిపోయింది. ఇదే అదునుగా పెద్ద డిమాండ్లూ చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు.
జనగామ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా చైర్మన్ కుర్చీనే డిమాండ్ చేస్తున్నారు. నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సిండికేట్ అయి మున్సిపల్ చైర్మన్ కుర్చీ తమకు ఇస్తేనే మద్దతు తెలుపుతామని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు తేల్చి చెప్పేశారు. ఇలా అనేక చోట్ల కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ పార్టీకి స్వతంత్ర అభ్యర్థులు పెద్ద డిమాండ్ చేస్తూ చెమటలు పట్టిస్తున్నారు. ఎంత పెద్ద లీడర్ తో చెప్పించినా సరే వినట్లేదు. తమ డిమాండ్లను ఏ పార్టీ నెరవేరిస్తే ఆ పార్టీకి మద్దతు తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు.
దీంతో రెండు పెద్ద పార్టీలు తమలో తాము మంతనాలు జరుపుకుంటున్నారు. చైర్మన్ పీఠం ఇవ్వటం కుదరదు కాబట్టి ఇతర కీలక హామీలు ఇచ్చి తమ వైపు స్వతంత్ర అభ్యర్థులను మలుపుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హంగు ఏర్పడిన కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల కిడ్నాప్ లు కూడా జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు వస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు అధికార పార్టీకి మొగ్గు చూపుతారా.. లేదంటే బిఆర్ ఎస్ పార్టీకి జై కొడతారా అనేది తెలియాల్సి ఉంది. చైర్మన్ ఎన్నికకు ఇంకా సమయం ఉంది అని లైట్ తీసుకోకుండా.. తమ అభ్యర్థులను కాపాడుకుంటున్నాయి ప్రధాన పార్టీలు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
