HYD: 'ఆపరేషన్ సిందూర్'లో హైదరాబాద్ సత్తా

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ సత్తా... ప్రత్యేకంగా హైదరాబాద్ సత్తా ప్రపంచానికి మరోసారి తెలిసి వచ్చింది. దేశ రక్షణ రంగానికి తెలంగాణ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది. ఐటీ కేంద్రంగా, ఏయిరోస్పేస్ హబ్‌గా పేరుగాంచిన ఈ భాగ్య నగరంలో 37కు పైగా కేంద్ర రక్షణ, పరిశోధన, రక్షణ పరిశ్రమలు ఉన్నాయి. దేశ వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది
2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో వాడిన స్పైస్ 2000 క్షిపణులు, హైదరాబాద్‌లోని కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థ తయారు చేసినవే. ఆపరేషన్ సిందూర్ కోసం కూడా హైదరాబాద్ లోని రక్షణ రంగ సంస్థలు తయారు చేసిన స్పేస్ క్షిపణులను ఉపయోగించారు. దేశ రక్షణ సన్నద్ధతలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పేందుకు ఈ పరిణామాలే నిదర్శనం. హైదరాబాద్‌లో ఉన్న 37 రక్షణ రంగ సంస్థలతో పాటు ఇంజినీరింగ్ కాలేజీలు, టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్లు, DRDO అనుబంధ పరిశోధన కేంద్రాలు రక్షణ రంగానికి నాణ్యమైన మానవ వనరులను అందిస్తున్నాయి
ఇందులో ఇస్రోకు ఉపయోగపడే డేటా సెంటర్‌తోపాటు శాటిలైట్ తయారీలో అవసరమైన చిన్న చిన్న బొల్టులు, ఇంజిన్లు, టర్బైన్లు లాంటి అనేక పరికరాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. హకీంపేటలో కేంద్రీకృతమైన ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని టాటా ఎయిరోస్పేస్ సెంటర్, క్షిపణి రూపకల్పనలో కీలకపాత్ర పోషించే డీఆర్డీవో తదితర పదుల సంస్థలతో రక్షణ పరిశోధనలకు నగరం కేంద్రంగా ఉంది.
ఆపరేషన్ సిందూర్ లో హైదరాబాద్ రక్షణ తయారీ రంగం తన సామర్థ్యాన్ని చాటింది. బ్రహ్మోస్, ఆకాష్ వంటి కీలక క్షిపణుల తయారీలోనూ హైదారాబాద్ లో ఉన్న రక్షణ రంగ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ ఆయుధాలతోనే పాక్ వెన్నులో భారత్ వణుకు పుట్టించింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత హైదరాబాద్‌లో ఉన్న రక్షణ రంగంలోని కంపెనీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.
భారత “మిస్సైల్ క్యాపిటల్”గా పేరుగాంచిన హైదరాబాద్.. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ రక్షణ తయారీ సంస్థలకు నిలయంగా ఉంది. హైదరాబాద్‌లో ఇప్పటికే DRDO, BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్, BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, Research Centre వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు, అనేక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు ఉన్నాయి. క్షిపణి తయారీ కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. అదానీ ఎల్బిట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, రఘు వంశీ, జెన్ టెక్నాలజీస్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. క్షిపణి వ్యవస్థలకు కీలకమైన సబ్-సిస్టమ్‌లను ఈ సంస్థలు సరఫరా చేస్తాయి
ప్రభుత్వ రంగంలోని డీఆర్‌డీఓ, బీడీఎల్, బీఈఎల్‌తో పాటు ప్రైవేట్ రంగంలోని ఎంటార్ టెక్నాలజీస్, అదానీ ఎల్బిట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, అస్త్రా మైక్రోవేవ్, కల్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, అనంత్ టెక్నాలజీస్, రఘవంశీ, జెన్ టెక్నాలజీస్ వంటి కంపెనీలకు సైనిక దళాల నుంచి పెద్దఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో ఈ కంపెనీలు తయారు చేసిన ఆయుధాలు, ఆయుధ విడి భాగాలు సత్తా చాటాయి. దీంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కొనుగోలు చేసి నిల్వ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పాక్‌తో కాల్పుల విరమణ కుదిరినా, అది తాత్కాలికమేనని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పెద్దఎత్తున బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులు, డ్రోన్లను పెద్దఎత్తున కొనుగోలు చేసి నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో సైనిక దళాల నుంచి వచ్చిన ఆర్డర్లను కంపెనీలు ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి చేసేందుకు గడువు ఇచ్చేవారు. ఇప్పుడు కొద్ది నెలల్లోనే సరఫరాలు పూర్తి చేయాలని సైనిక దళాలు కోరుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com