హైదరాబాద్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

హైదరాబాద్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు
హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాచుపల్లి కేజీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎన్టీఆర్‌ సేవా సమితి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాచుపల్లి కేజీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎన్టీఆర్‌ సేవా సమితి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి నందమూరి రామకృష్ణ, టీడీ జనార్ధన్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, హెచ్‌జే దొర, మీనవల్లి మాచరరావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ, సినీనటుడు మురళీమోహన్‌ తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్‌ సేవా సమితి నూతన లోగోను ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

ఎన్టీఆర్ భావజాలాన్ని భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నామని మాచర రావు, హెచ్‌జే దొర తెలిపారు. 60 ఏళ్ల వయస్సులో రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లో సీఎం పదవి చేపట్టారని.. రాజకీయాన్ని పెత్తందార్ల నుంచి సామాన్యుడికి తీసుకొచ్చారని కొనియాడారు.

తెలుగు వారి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు నాడు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని మురళీమోహన్‌ అన్నారు. రంగులేసుకున్న వ్యక్తి రాజకీయాలు ఏం చేస్తాడని కాంగ్రెస్‌ విమర్శించిందని.. అలాంటి కాంగ్రెస్‌ను ఓడించి సీఎం అయ్యారని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఎన్టీఆర్‌ రికార్డు ఎవరూ బద్దలు కొట్టలేరని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలో తమ్ముడిగా పేరు తెచ్చుకున్నందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు.

తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌ అన్నారు రావుల చంద్రశేఖర్‌రెడ్డి. మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. హెల్త్‌ యూనివర్సిటీకి పేరు మార్చడం దారుణమని అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ నిలిచి ఉంటారని అన్నారు.

ఫాదర్స్‌ డే రోజు శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని నందమూరి రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశమంతటా అమలవుతున్నాయని.. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

Tags

Next Story