HYD RAINS: మూసీ మహోగ్రరూపం

తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో జన జీవనం స్తంభించిపోయింది. దీనితి తోడు జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నిండుకుండలా మారడంతో గేట్లను ఎత్తి భారీగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన కురిసిన వర్షాల కారణంగా ప్రవాహం పెరగడంతో మొదట 13,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. దానిని 35,000 క్యూసెక్కులకు పెంచడంతో మూసీ నది ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా మహోగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు మూసీ వరద ఉధృతి పెరిగింది. చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర వరద ప్రవహించింది. మూసారాంబాగ్ వంతెన పైనుంచి ఏకంగా 10 అడుగుల మేర నీరు ప్రవహించింది. ఎంజీబీఎస్ (మహాత్మాగాంధీ బస్ స్టేషన్) లోకి వెళ్లే రెండు వంతెనలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద నీరు నేరుగా బస్డాండ్‌లోకి చేరడంతో వందల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. పోలీసులు వారిని తాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. చాదర్‌ఘాట్ కాజ్వే వంతెన, మూసారాంబాగ్ బ్రిడ్జితో సహా పలు ప్రాంతాల్లో రహదారులను పూర్తిగా మూసివేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీని ప్రభావంతో దిల్సుఖ్నగర్, కోఠి మధ్య తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంజీబీఎస్‌లో చిక్కుకున్న ప్రయాణికులను వెంటనే బయటకు తరలించాలని, పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అర్థరాత్రి స్వయంగా ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిని పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
చాదర్ ఘాట్ లో నీట మునిగిన ఇళ్లు
మూసీ ఉద్ధృతికి హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ సమీపంలో పలు కాలనీలు నీట మునిగాయి. అంబేడ్కర్ బస్తీతో పాటు పలు కాలనీల్లోకి వరద చేరింది. చాదర్ ఘాట్ సమీపంలో నదికి ఇరువైపులా ఉన్న ఇళ్లు నీట మునిగాయి. మూసీ నీటిమట్టం అంతకంతకు పెరగడంతో పరీవాహక కాలనీల్లో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద పురోగతిలో ఉన్న పైవంతెన నిర్మాణ సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయింది. జియాగూడ వద్ద మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జియాగూడ నుంచి పురానాపూల్ వెళ్లే హైవేపైకి భారీగా వరద చేరుతోంది. ఫలితంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ధాటికి పలు వాహనాలు, చిన్న చిన్న ఆలయాలు నీటమునిగాయి. ఇళ్లను తాకుతూ మూసీ ప్రవహిస్తోంది. ప్రజలు ప్రవాహం వైపు వెళ్లకుండా పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు పహారా కాస్తున్నాయి.
మూసీలో వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా, పోలీసు అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితుల కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 1000 మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. అక్కడ వారికి ఆహారం, తాగునీరు, వైద్య సహాయం ఏర్పాటు చేశారు. అవసరమైనవారికి దుప్పట్లు అందిస్తున్నారు. పౌరులకు భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సహాయ కేంద్రాలను కూడా ఆర్వీ కర్ణన్ సందర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com