రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కూకట్‌పల్లి ASI.. 8 మందికి అవయవదానం

రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన కూకట్‌పల్లి ASI మహిపాల్ రెడ్డి భౌతిక కాయానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ నివాళులర్పించారు. మహిపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిపాల్ రెడ్డి పార్థీవదేహానికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన అంతిమ యాత్రలో సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి 50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
నిజాంపేట రోడ్డులో ఈ నెల 27న రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. మద్యం మత్తులో కారు నడుపుతున్న ఓ వ్యక్తిని మహిపాల్ విచారిస్తున్నారు. అదే సమయంలో అటుగా కారులో వస్తున్న మరో వ్యక్తి విచారణ జరుపుతున్న ASI మహిపాల్ రెడ్డిని కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిపాల్‌రెడ్డి తలకు తీవ్రగాయం కాగా.. అతడిని హుటాహుటిన కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ASI మహిపాల్ రెడ్డి కన్నుమూశారు.
మద్యం సేవించి వాహనం పడపడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుందని సీపీ సజ్జనార్ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మరింత కఠినంగా వ్యవహరిస్తామని సీపీ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరణించిన ASI మహిపాల్ రెడ్డి... తన అవయవాలను దానం చేశారని... ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరూ అవయవదానాలు చేయాలని సూచించారు.
తన అవయవాలను దానం చేసి, ఎనిమిది మంది ప్రాణాలను కాపాడినందుకు పోలీసు అధికారి కుటుంబాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దుఖసాగరంలో మునిగిన మహిపాల్ కుటుంబాన్ని పరామర్శించారు. మరణించిన సహోద్యోగి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు సజ్జనార్‌తో పాటు మరికొంత మంది సీనియర్ పోలీసు అధికారులు పాడెను భుజంపై మోశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com