Indian Student : కెనడా నదిలో ఈత కొడుతూ హైదరాబాద్ విద్యార్థి మృతి

కెనడాలో హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు ఆదివారం నీట మునిగి మృతి చెందాడు. మీర్పేటకు చెందిన సునీత, రవిల పెద్ద కుమారుడు ప్రణీత్ ఎంఎస్ కోసం 2019లో కెనడాకు వెళ్లారు. కెనడియన్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఈ క్రమంలో కెనడాలో తన స్నేహితులతో ఉంటూ ఉద్యోగం కోసం చూస్తున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సరదాగా ఈనెల 15న టొరంటోలోని లేక్ క్లియర్ కు పార్టీకి వెళ్లాడు.
పార్టీ ముగిశాక బోటులో కాకుండా ఈత కొడుతూ రావాలని ప్రయత్నించాడు. అయితే చెరువు మధ్యలోకి రాగానే మునిగిపోయాడు. స్నేహితులు దూకి రక్షించాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమై ప్రణీత్ మృతదేహాన్ని వెలికితీసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రణీత్ చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. టొరంటో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు.
పుట్టిన రోజునాడే మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు న్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని త్వరగా ఇండియాకి చేరడానికి ప్రభుత్వం సహకరించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com