Hydra : హైడ్రాకు కులం లేదు.. మతం లేదు : మంత్రి కోమటిరెడ్డి

హైడ్రాకు పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భారతదేశ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన సుప్రసిద్ధ ఇంజినీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను యువ ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి కార్యక్రమంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1908లో హైదరాబాద్‌లో భారీ వరదలు వచ్చి హైదరాబాద్ మొత్తం నిండా మునిగిందని, వేలాదిమంది వరదల్లో గల్లంతయితే నిజాం నవాబు, విశ్వేశ్వరయ్య గురించి తెలుసుకొని హైదరాబాద్‌కు ఆహ్వానించి హైదరాబాద్‌లో ఫ్లడ్ ప్రొటెక్షన్ అండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు గురించి విన్నవించాడని గుర్తు చేశారు. హైదరాబాద్ భౌగోళిక స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేసిన విశ్వేశ్వరయ్య అని చెప్పారు. వరదను తట్టుకోవాలంటే నగరానికి పై భాగంలో ఒక పెద్ద రిజర్వాయర్ కట్టాలని ప్రపోజ్ చేశారని తెలిపారు. అందులో భాగంగా మూసీకి ఉపనది అయిన ఈసా నదిపై ఇప్పుడున్న హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేశారని గుర్తు చేశారు. ఆనాడు 788 చెరువులతో ఉన్న హైదరాబాద్ పైభాగంలో ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నయో మనమంతా ఒకసారి ఆలోచించాలన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి మళ్లీ 1908 నాటి వరదలను పునరావృతం కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఎంత ముఖ్యమో.. ప్రాజెక్టులు, బ్రిడ్జిలు, రోడ్లు, బిల్డింగ్ నిర్మించే ఇంజినీర్లు అంతే ముఖ్యమని ఆయన అన్నారు. ఇంజినీర్లంటే ప్లాన్లు గీసే ఆర్టిస్టులు కాదని.. నాగరికత అనే వాహనాన్ని నడిపించే ఇంజన్లని ఆయన కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com