Hydra : హైడ్రాలో జీతాలు త‌గ్గడంలేదు.. పాత జీతాలే ఇస్తామ‌న్న హైడ్రా

Hydra : హైడ్రాలో జీతాలు త‌గ్గడంలేదు.. పాత జీతాలే ఇస్తామ‌న్న హైడ్రా
X

హైడ్రాలో ఔట్ సోర్సింగ్ (ఒప్పంద కార్మికులు) ద్వారా పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు ఏమీ తగ్గడం లేదని హైడ్రా స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబ‌రు 1272 ప్ర‌కారం జీహెచ్ ఎంసీలోని ఈవీడీఎం ద్వారా హైడ్రాకు స‌మ‌కూరిన ఉద్యోగుల జీతాలు రాష్ట్రంలోని వేరే డిపార్ట్‌మెంట్స్‌లో ప‌ని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేత‌నాల‌కు స‌మానంగా స‌వ‌రించ‌డం జ‌రిగింది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ దృష్టికి హైడ్రా తీసుకెళ్లింది. ఆ వ్య‌త్యాసం మొత్తాన్ని జీహెచ్ ఎంసీ నుంచి మ్యాచింగ్ గ్రాంట్‌గా అంద‌జేయాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఆ మ్యాచింగ్ ఫండ్‌తో మొత్తం జీతం చెల్లించ‌డానికి హైడ్రా ప్ర‌య‌త్నించింది. అయితే ఆ మ్యాచింగ్ ఫండ్ రావ‌డం కాస్త ఆల‌స్యం అయ్యింది. స్టాండింగ్ క‌మిటీ ఆమోదం త‌ర్వాత మ్యాచింగ్ ఫండ్ విడుద‌ల చేస్తామ‌ని జీహెచ్ ఎంసీ తెలిపింది. ఉద్యోగులు జీతాలు లేక ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో జీవో 1272 ప్ర‌కారం వెంట‌నే జీతాలు హైడ్రా చెల్లించింది. వ్య‌త్యాసం మొత్తాన్ని త్వ‌ర‌లో స‌ర్దుబాటు చేస్తామ‌ని కూడా చెప్పింది. అయితే కొంత‌మంది ఉద్యోగులు జీతాలు త‌గ్గిన‌ట్టు భావించి బుధ‌వారం ఆందోళ‌న‌కు దిగారు. ఈ విష‌య‌మై ఉద్యోగుల‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌ చ‌ర్చ‌లు జ‌రిపారు. జీతాలు త‌గ్గ‌వ‌ని.. జీహెచ్ ఎంసీ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ అవ్వ‌గానే స‌ర్దుబాటు చేస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో హైడ్రాలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఊర‌ట చెందారు. వెంట‌నే విధుల్లోకి చేరారు. వారికి జీహెచ్ ఎంసీలో ఈవీడీఎం భాగంగా ఉన్నప్పుడు అందిన జీతాలే ఇప్పుడు కూడా చెల్లించ‌డం జ‌రుగుతుంద‌ని హైడ్రా ఒక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది.

Tags

Next Story