Hydra : త్వరలో హైడ్రా ప్రత్యేక యాప్ .. హైడ్రా కమిషనర్ రంగనాథ్

చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా హైడ్రా చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా త్వరలో ప్రత్యేక యాప్ తీసుకొస్తుందని, అందులో నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లు గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులతో ఐపీఎస్ రంగనాథ్ సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. నుంచి జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు హైడ్రా యాప్ తెస్తామన్నారు. బాధితులు, ప్రజలు ఆఫీసులకు రాకుండా.. హైడ్రా యాప్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆక్రమణలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ భూములుగానీ, చెరువులు, కుంటల స్థలాలు ఆక్రమణకు గురైతే క్షణాల్లో తెలిసేందుకు యాప్ వ్యవస్ధను తెస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్నట్లుగా నగరంలోని చెరువులకు పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తామన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో పాటు అనంతరం వ్యర్థాల తొలగింపు సైతం ఉంటుందన్నారు. మొదటగా ఎర్రకుంట, కూకట్ పల్లి నల్లచెరువలో వ్యర్థాల తొలగింపు చేపట్టాలని నిర్ణయించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com