KCR : అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్ అంతు చూస్తా: కేసీఆర్

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రభుత్వ తీరును ఎండగడతానని చెప్పారు. ‘కాంగ్రెస్ సర్కార్ అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోంది. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ దే అధికారం. వచ్చే నెల 27న వరంగల్‌లో జరిగే సభలో కాంగ్రెస్, బీజేపీని నిలదీస్తాం’ అని పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీలో యువత, మహిళల భాగస్వామ్యం పెంచాలని సూచించారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా తెలంగాణకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయని, ఈ నేపథ్యంలో దేశ రాజకీయ పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతోందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కేసీఆర్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com