Nalgonda District : పరీక్ష రాయనివ్వకపోతే చనిపోతా.. పదో తరగతి విద్యార్థిని ఆవేదన

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తనను అన్యాయంగా డీబార్ చేశారని నకిరేకల్‌కు చెందిన విద్యార్థిని ఝాన్సీరాణి ఆవేదన వ్యక్తం చేసింది. తాను పరీక్ష రాస్తుండగా కిటికీ వద్దకు వచ్చిన కొందరు బెదిరించి పేపర్ ఫొటో తీసుకున్నారని వాపోయింది. తనపై డీబార్ ఎత్తివేసి మళ్లీ పరీక్ష రాయనివ్వాలని కోరింది. లేదంటే ఆత్మహత్యే దిక్కని కన్నీళ్లు పెట్టుకుంది. అటు ఈ కేసులో ఓ మైనర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను పరీక్ష రాస్తున్న హాల్ కిటికి వద్దకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, తమకు ప్రశ్నపత్రం చూపించాలని బెదిరించారని ఆమె వాపోయింది. పేపర్ చూపకపోతే రాయితో కొడతామని బెదిరించడం వల్లే తాను ప్రశ్నపత్రం చూపించాల్సి వచ్చిందని తెలిపింది. తాను తెలివైన విద్యార్థినినని, రాష్ట్రంలో ఎక్కడ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసే అవకాశమిచ్చినా రాస్తానని అధికారులను వేడుకుంది. పరీక్షలు రాయనివ్వకపోతే తనకు చావే శరణ్యమంటూ ఝాన్సీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్న నకిరేకల్ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలనే డిమాండ్లు వెలువడుతున్నాయి. ప్రశ్నాపత్రం ఎవరి కోసం ఫొటో తీశారనే అంశాన్ని ఇప్పటివరకు తేల్చలేకపోవడం వెనక రాజకీయ, అధికార ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నకిరేకల్ సమీపంలోని మరో నియోజకవర్గానికి చెందిన ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలే ఇందులో కీలకమైన సూత్రధారులని, ఆ విషయం బయటకు రాకుండా ఆకతాయిల చేష్ఠగా చిత్రీకరించి, కేసుని పక్కదారి పట్టిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com