CP CV Anand : తప్పు నాదైతే హోంగార్డుకైనా సారీ చెబుతా.. సీపీ సీవీ ఆనంద్ వైరల్ ట్వీట్

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇటీవల జాతీయ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేయడం వైరల్ అయింది. సంధ్య థియేటర్ ఘటనకు నేషనల్ మీడియా సంస్థలు మద్దతిస్తున్నట్టుగా ఉందని సీవీ ఆనంద్ చెప్పడం వివాదాస్పదమైంది. తన వ్యాఖ్యల పట్ల విమర్శలు రావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. ఓ నెటిజన్ స్పందిస్తూ... చేసిన తప్పును అంగీకరించడం గొప్ప విషయమని, అదే మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టిందంటూ సీవీ ఆనంద్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. నరేశ్ అనే వ్యక్తి చేసిన ఆ ట్వీట్ ను సీవీ ఆనంద్ రీట్వీట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎప్పుడైనా నేను తప్పు చేశానని భావిస్తే నా హోంగార్డుకైనా సరే క్షమాపణ చెప్పేందుకు వెనుకాడను. ఈ గుణం నాలో చిన్నప్పటి నుంచి ఉంది. బహుశా క్రికెట్ ఆడడం వల్ల వచ్చి ఉంటుంది. క్రికెట్ ఆడడం అనేది నన్ను మెరుగైన వ్యక్తిగా మలిచింది. నా అహాన్ని వదిలేయడం ద్వారా నేను అందరిలో ఒకడిగా ఉండాలనుకుంటాను. ఓ వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా మలిచేందుకు జట్టుగా ఆడే క్రీడలు చాలా ముఖ్యమని భావిస్తాను. కానీ కార్పొరేట్ తరహా విద్యా వ్యవస్థలో ఇటువంటి అవకాశం లేకుండా పోవడం దురదృష్టకరం" అని సీవీ ఆనంద్ తన ట్వీట్ లో తెలిపారు. ఈట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com