కేసీఆర్ ఆదేశిస్తే..రాజకీయాల్లోకి వస్తా:శ్రీనివాసరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నేతలు టిక్కెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీకి సిద్ధమన్నారు. అయితే స్వతంత్రంగా గానీ, ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఆలోచన లేదని వివరించారు. బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలుస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కొన్నాళ్లుగా డీహెచ్ రాజకీయ ప్రవేశంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
కొత్తగూడెంలో ఉపాధి అవకాశాలు లేక చాలామంది హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయంపై నియోజకవర్గ ప్రజలకు శ్రీనివాసరావు ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా జీఎస్ఆర్ ట్రస్టు ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఇక తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉచిత వైద్య సేవల ద్వారా శ్రీనివాసరావు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాను పుట్టిన కొత్తగూడెం ప్రాంతంలో జీఎస్ఆర్ ట్రస్టు నెలకొల్పి విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో 2 కోట్లతో ట్రామా కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం డాక్టర్‌గా పేషెంట్లకు సేవలందిస్తున్నానని.. ఇకపై ప్రజలకు నేరుగా సేవ చేయాలనుకుంటున్నానని శ్రీనివాసరావు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com