విషాదం.. ఆర్మీ జవాన్.. అమ్మానాన్నని చూడ్డానికని వచ్చి..

విషాదం.. ఆర్మీ జవాన్.. అమ్మానాన్నని చూడ్డానికని వచ్చి..
పొలం పనులు చేసుకునే తండ్రికి కాలు విరిగిందని తెలిసి 15 రోజుల క్రితం సెలవు తీసుకుని స్వగ్రామానికి వచ్చాడు.

బీటెక్ చదివాడు.. ఏ సాప్ట్ వేర్ జాబో చేసుకుంటే ఏసీ రూముల్లో కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకోవచ్చు. వేలల్లో జీతం సంపాదించుకోవచ్చు. కానీ అతడు ఆర్మీలో చేరాలని దేశానికి సేవ చేయాలని ఆశించాడు. కానీ అంతలోనే అతడి ఆశలను అడియాశలు చేస్తూ మృత్యువు కబళించింది. 25 ఏళ్ల మోతీలాల్‌కి నూరేళ్లు నిండిపోయాయని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం మేగ్యానాయక్ తండాకు చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దేగావత్ జోద్యానాయక్ జమ్లీబాయి దంపతులకు ముగ్గురు కుమారులు.. రెండో కుమారుడు దేగావత్ మోతీలాల్ బీటెక్ పూర్తి చేశాడు. 2017లో సైన్యంలో చేరాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించాడు.

పొలం పనులు చేసుకునే తండ్రికి కాలు విరిగిందని తెలిసి 15 రోజుల క్రితం సెలవు తీసుకుని స్వగ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో రూప్లనాయక్ తండాకు చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లి కూడా నిశ్చయమైంది.

సెలవులు పూర్తవడంతో 2020 డిసెంబర్ 29న పంజాబ్ వెళ్లడానికి సిద్ధమయ్యాడు. 28వ తేదీన విమాన టికెట్ తెచ్చుకునేందుకు కామారెడ్డిలోని తన స్నేహితుని వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి వస్తుండగా సదాశివనగర్ మండలం దగ్గి వద్ద 44వ జాతీయ రహదారిపై వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

తలకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. 15 రోజుల నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మోతీలాల్ శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశాడు. తమని చూడ్డానికని వచ్చిన కొడుకు శాశ్వతంగా దూరం కావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

కొడుకుని బతికించుకునేందుకు వైద్యం కోసం రూ.8.72 లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కలేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story