Telangana News : సర్పంచ్ ఏకగ్రీవాలకు విశ్వ ప్రయత్నాలు..

తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల సందడి జోరుగా కనిపిస్తోంది. సర్పంచ్ అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు మీటింగులు పెడుతూ కుల సంఘాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎలాగైనా తమని గెలిపించాలని ఎంత ప్రాధేయపడుతున్నారో చూస్తూనే ఉన్నాం. అయితే చాలా జిల్లాల్లో మూడో విడత నామినేషన్లు రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. రెండో విడతతో పాటు మూడో విడత జరుగుతున్న గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1514 గ్రామపంచాయతీలు ఉండగా 638 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. వీటిపైనే అన్ని పార్టీలు ప్రధానంగా ఫోకస్ పెడుతున్నాయి. ఈ రిజర్వ్ అయిన స్థానాలతో పాటు మిగతా స్థానాల్లోనూ ఏకగ్రీవం చేయాలంటూ లోకల్ ఎమ్మెల్యేలు తెగ ప్రయత్నిస్తున్నారు.
తమ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే ప్రత్యేక నిధులు ఇస్తామంటూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హామీలు ఇస్తున్నారు. తమ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి తమ వాళ్ళని ఏకగ్రీవం చేస్తే నిధులు ఇచ్చే హామీ తమది అంటూ లోకల్ లీడర్లు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సర్పంచులను గెలిపించుకునే బాధ్యతను ఇచ్చింది అధిష్టానం. తమ నియోజకవర్గాల్లో ఎక్కువమంది తమ పార్టీ అభ్యర్థుల సర్పంచులు గా ఉంటే తమకే పట్టు పెరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఆ స్థాయిలో కష్టపడుతున్నారు. కుదిరినచోట ఏకగ్రీవం చేస్తూ మిగతా చోట్ల కూడా దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు.
ఒకవేళ కుదరని గ్రామాల్లో పార్టీ నుంచి ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడేలా చూస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్, బిజెపిలు కూడా వీలైనంతవరకు ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో ఏకగ్రీవాలకు చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఒకే సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఏకగ్రీవాలు ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ రిజర్వ్ స్థానాలపై అన్ని పార్టీల ఫోకస్ పెరిగింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

