JAGAN TOUR: జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి

వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించేందుకు జగన్ తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయల్దేరిన సమయంలో ఈ అపశ్రుతి జరిగింది. జోగి రమేష్ నివాసం సమీపంలో వైసీపీ నేత ఒకరు అకస్మాత్తుగా మృతి చెందడం కలకలం రేపింది. జగన్ పర్యటన నేపథ్యంలో జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న వైసీపీ చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు డి. రాంబాబు పల్స్ పడిపోయి ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇదే సమయంలో ఇబ్రహీంపట్నంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై స్టంట్ చేస్తూ రోడ్డుపై ఉన్న బార్ గేట్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు ఇబ్రహీంపట్నం కొత్తగేట్‌కు చెందిన భార్గవ్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగన్ పర్యటన సందర్భంగా ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. జన సమీకరణతో గుంపులు గుంపులుగా తిరుగుతూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. రింగు రోడ్డు తదితర ప్రాంతాల్లో బైక్‌లతో స్టంట్‌లు చేస్తూ అలజడి సృష్టించారు. జోగి రమేష్ సహా పలువురు వైసీపీ నేతలు అక్కడే ఉన్నా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
