Jana Sena : తెలంగాణ పురపోరులో జనసేన.. ప్రభావం ఎంత..?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మొన్న కొండగట్టుకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న జనసేన, ఇప్పటికే కొత్త అడ్ హాక్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, జనసేన తనకు పట్టు ఉన్న ప్రాంతాల్లోనే పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ, టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన, అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది. తెలంగాణలో బీజేపీతో పొత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలు జనసేనతో పొత్తు లేదని స్పష్టంగా చెబుతున్నా, రాజకీయాల్లో చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చన్న అభిప్రాయం ఉంది.
పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో చూస్తే జనసేన, బీజేపీ మధ్య సాన్నిహిత్యం ఉంది. అందువల్ల జాతీయ స్థాయిలో చర్చలు జరిగి, తెలంగాణలోనూ పొత్తు కుదిరితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.తెలంగాణలో జనసేన ఇప్పటికీ పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా ఎదగలేదు. అయినా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్, యువతలో ఉన్న క్రేజ్ కారణంగా పార్టీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇదే బలంగా చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగుపెట్టాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో క్రమంగా బలమైన పట్టు సాధిస్తున్న జనసేన, అదే ప్రభావాన్ని తెలంగాణలో కూడా చూపగలదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటు చీలిక తగ్గడంతో పాటు, పార్టీకి గుర్తింపు మరింత పెరుగుతుందని అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే, ఆశించిన స్థాయి పనితీరు ఉండకపోవచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక బలం, క్యాడర్ కీలకం కావడంతో, కొత్తగా రంగంలోకి దిగుతున్న పార్టీలకు సవాల్ తప్పదని అంటున్నారు. జనసేన పోటీ కేవలం స్థానిక ఎన్నికల వరకే పరిమితమా? లేక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు అడుగులా అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుందేమో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

