Job Calender : నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్

రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం డిప్యూటీ సీఎం భట్టి, జీహెచ్ఎంసీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల విలీన ప్రక్రియకు మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీలను నియమించారు. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు రూ. 437 కోట్లను కేటాయించారు. క్రీడాకారులు నిఖత్ జరీన్, సిరాజ్‌లకు ఇళ్ల స్థలాలు, గ్రూప్ –1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
ఇక, గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌కి రికమండ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మూసీలో ఎప్పటికీ ఫ్రెష్ వాటర్ ఉండేందుకు తగు నిర్ణయాలు తీసుకున్నారు.
కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌కి రికమండ్ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రేపు (శుక్రవారం) అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రేషన్ కార్డుల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన, దామోదర రాజనరసింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా సబ్ కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. మరోవైపు రాజీవ్ రతన్ కొడుకు హరీ రతన్‌కు మున్సిపల్ కమిషనర్‌గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అంశాలకు మంత్రివర్గం ఆమోదమద్ర వేసిందని వివరించారు. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు గంటన్నర పాటు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో భాగంగా.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన పలు బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. 6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి విపరీత డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో 2 రోజుల క్రితం ప్రకటించారు. ఈ మేరకు రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. ఈ మేరకు విధివిధానాల ఖరారుకు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటుకు ఆమోదముంద్ర వేసింది కేబినెట్. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే, స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధివిధానాలపై చర్చించింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఆర్ఆర్ఆర్ పరిధిలోని పంచాయతీలను కార్పొరేషన్లలో విలీనం చేయడంపై చర్చించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. ప్రకృతి విపత్తుతో విలవిలలాడిన వాయనాడ్ ప్రాంతానికి అండగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. మృతులకు సంతాపం తెలిపిన తెలంగాణ కేబినెట్, అక్కడి బాధితులకు సాయం చేయాలని నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com