Dr. Reddy's : రెడ్డీస్ ల్యాబ్స్ లో ఉద్యోగాలు కోత

హైదరాబాద్ లో ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 25 శాతం ఉద్యోగుల సంబంధిత ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించింది. పలు డిపార్టుమెంట్లకు సంబంధించి కోటిరూపాయలకంటే ఎక్కువ వేతనాలు ఉన్న ఉద్యోగులను రాజీనామా చేయాల్సిందిగా కంపెనీ యాజమాన్యం ఆదేశించింది. మొత్తంగా ఉద్యోగుల సంబంధిత వ్యయాలను 25 శాతం వరకు ఆదా చేయాలని కంపెనీ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ అండ్ డీ విభాగంలోనూ 50-55 సంవత్సరాల వయస్సు ఉన్న ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ ఇచ్చింది.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్లో ప్రపంచ వ్యాప్తంగా 26,343 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో 21,757 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. 2024 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ కొత్తగా 6,281 మంది ఉద్యోగులను తీసుకుంది. కంపెనీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం 5,030 కోట్లు, శిక్షణ, అభివృద్ధి కోసం 39.2 కోట్లు ఛర్చు చేసింది. సంవత్సర కాలంలో 92 శాతం మంది ఉద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందారు. 25 శాతం ఉద్యోగుల ఖర్చు తగ్గించుకోవడం అంటే సంవత్సరానికి దాదాపుగా 1300 కోట్ల రూపాయలను ఆదా చేసుకోవాలని కంపెనీ నిర్ణయించింది. 300-400 మంది వరకు ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com