KTR : ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలి: గ్రూప్ _1 వివాదం పై కేటీఆర్ సంచలన ట్వీట్...

తెలంగాణరాజకీయాలు ఇప్పుడు గ్రూప్ _1 వివాదం చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. మార్చి 10న ప్రకటించిన గ్రూప్-1 పరీక్ష ఫలితాల ఆధారంగా రూపొందించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం తిరిగి మూల్యాంకనం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)ని ఆదేశించింది హైకోర్టు. దీంతో గ్రూప్ _1 కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన... "అసమర్థత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కారణమయ్యాయి. అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతు కోశారు" అని రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పూర్తిగా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడిన యువత కలలు, వారి తల్లిదండ్రుల కష్టార్జితం వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం... గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని...ఈ వివాదం పై జ్యుడీషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com