Jogulamba Temple : జోగులాంబ ఆలయానికి త్వరలోనే పూర్వ వైభవం .. రూ. 345 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం

జోగులాంబ ఆలయానికి త్వరలోనే పూర్వ వైభవం కల్పించాలని, అందుకు రూ. 345 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తూ ఐదవ శక్తి పీఠం జోగులాంబ ఆలయ పునరుద్దరణ కమిటీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన జోగులాంబ ఆలయ పునరుద్దరణ కమిటీ ప్రత్యేక సమావేశంలో ఎండోమెంట్స్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, ధార్మిక సలహాదారు, స్థపతి గోవింద హరి, మూర్తి, రోడ్లు, భవనాలు, ఆర్కియాలాజీ, ఎండోమెంట్స్ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జోగులాంబ ఆలయ పునరుద్దరణ కోసం రూ. 4.9 కోట్లతో తక్షణమే పనులు ప్రారంభించాలని, ఆలయ పునరుద్దరణ పనులు మూడు దశలలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. హైవేలలో షైనేజ్ బోర్డులు ఏర్పాటు చేయాలని, అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, సౌండ్ అండ్ లైట్ షో, బస్ స్టాండ్స్ నిర్మాణాలు వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో యాగ శాలలు, గోశాల, పెద్ద మ్యూజియం, సీసీటీవీ లు, కార్ పార్కింగ్, ప్రవచనం కేంద్రం, ఆలయ పురాతన కట్టడాలకు ఇబ్బంది కలిగించకుండా నూతన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com