Jubilee Hills : తుది దశకు జూబ్లీహిల్స్.. బైక్ ర్యాలీలతో హడావిడి

తెలంగాణలో కీలకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. మరీ ముఖ్యంగా బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇప్పటివరకు హోరాహోరీగా ప్రచారం సాగించాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు సవాళ్లు ప్రతి సవాళ్లు కీలక హామీలతో జూబ్లీహిల్స్ వేడెక్కిపోయింది. ఏ డివిజన్ లో తమకు వ్యతిరేకంగా ఓటు బ్యాంకు ఉందో ఆ డివిజన్లపై ఈ మూడు ప్రధాన పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి.. అక్కడ కీలకంగా హామీలు ఇచ్చాయి. ఆ కాలనీలో ఉన్న కీలక లీడర్లను తమ పార్టీలోకి తీసుకొచ్చాయి. ఈ ఉపఎన్నిక మూడు పార్టీలకు అత్యంత కీలకం అయిపోయింది.
ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీకి పట్టు పెరిగిందని ప్రజలు భావించడం ఖాయం. ఒకరకంగా ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ లాంటిది. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా ఏంటో చూపించాలని ఈ మూడు పార్టీలు భావిస్తున్నాయి. గులాబీ పార్టీకి సిట్టింగ్ సీటు అయితే.. కాంగ్రెస్ పార్టీకి తమ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అని నిరూపించుకునే అవకాశం. అటు బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఈ జూబ్లీహిల్స్ ఉంది. అందుకే ఈ మూడు పార్టీలు ఇక్కడ కచ్చితంగా గెలవాలని గల్లి గల్లిని చుట్టేస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రచార పర్వం రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. దీంతో అన్ని పార్టీలు హడావిడి మొదలు పెట్టేశాయి.
గల్లీ గల్లీలో బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. ప్రతి ఒక్క ఓటర్ ను మరొకసారి కలిచేందుకు నాయకులు కార్యకర్తలు పరుగులు పెడుతున్నారు. పార్టీల అధినేతల నుంచి కీలకమైన ఆదేశాలు ఉండటంతో.. అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ లోనే తిరుగుతున్నారు. నవంబర్ 11న పోలింగ్ ఉంటుంది. 14న ఎన్నికల రిజల్ట్ రాబోతున్నాయి. ప్రచారానికి మిగిలింది ఇవాళ రేపు మాత్రమే కాబట్టి అన్ని పార్టీలు హోరాహోరీగా బైక్ ర్యాలీలతో.. నానా హడావిడి చేస్తున్నాయి. మరి ఏ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరిస్తారో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

