MLA Shakeel: జూబ్లీహిల్స్‌ కారు యాక్సిడెంట్ కేసులో క్లైమాక్స్.. నిందితుడి అరెస్ట్..

MLA Shakeel: జూబ్లీహిల్స్‌ కారు యాక్సిడెంట్ కేసులో క్లైమాక్స్.. నిందితుడి అరెస్ట్..
MLA Shakeel: జూబ్లీహిల్స్ కార్‌ యాక్సిడెంట్‌ కేసులో ఎన్నో ట్విస్ట్‌ల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

MLA Shakeel: జూబ్లీహిల్స్ కార్‌ యాక్సిడెంట్‌ కేసులో ఎన్నో ట్విస్ట్‌ల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్‌ను పూర్తిగా పరిశీలించి, ఫింగర్‌ప్రింట్స్‌ కూడా చెక్‌ చేశాక.. సయ్యద్‌ అఫ్నాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. MLA షకీల్‌ కుమారుడు రాహిల్‌ కూడా కారులోనే ఉన్నా డ్రైవ్ చేసింది మాత్రం అఫ్నాన్‌గా గుర్తించినట్టు బంజారాహిల్స్‌ ACP సుదర్శన్‌ తెలిపారు.

గురువారం రాత్రి రోడ్‌ నంబర్‌ 45 హోండా షోరూమ్‌ వద్ద వేగంగా వచ్చిన థార్‌ కారు.. అక్కడి సెంటర్‌లో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న మహిళల్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 నెలల బాలుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్‌ తర్వాత కారులో వాళ్లంతా పారిపోవడంతో అసలేం జరిగింది, కారు నడిపింది ఎవరు అనేది తేల్చడం కష్టంగా మారింది.

ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కావడంతో దోషుల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలూ వచ్చాయి. ఐతే.. అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత అఫ్నానే కారు నడిపినట్టు తేలిందన్నారు ఏసీపీ. బోధన్‌ MLA షకీల్‌ కుమారుడు రాహిల్‌తో కలిసి మరో ఇద్దరు స్నేహితులు అఫ్నాన్‌, మహ్మద్‌ మాజ్‌ 17వ తేదీన మెక్‌డోనాల్డ్స్‌ డ్రైవ్‌ ఇన్‌కి వెళ్లారు.

తిరిగి వస్తున్న టైమ్‌లో తాను డ్రైవ్‌ చేస్తానంటూ అఫ్నాన్‌ కారు తీసుకున్నాడని, యాక్సిడెంట్ చేసింది అతనేనని పోలీసులు వివరిస్తున్నారు. అతను కూడా అంగీకరించాడని చెప్పారు. అఫ్నాన్‌తోపాటు మాజ్‌ని కూడా అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రాహిల్ కోసం నాలుగు టీమ్‌లతో గాలిస్తున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగమే ప్రమాదానికి కారణమన్నారు పోలీసులు.

యాక్సిడెంట్ కేసు ఇంత జటిలం కావడానికి, నిందితుల్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు తెరపైకి రావడానికి వరుసగా జరిగిన పరిణామాలే కారణంగా కనిపిస్తున్నాయి. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ఈ ప్రమాదం తర్వాత స్పందించినా కారు మాత్రం తనది కాదన్నారు. బంధువు మీర్జాది అని చెప్పారు. అప్పుడప్పుడు ఆ కారును తాను ఉపయోగిస్తుంటానని అందుకే ఎమ్మెల్యే స్టిక్కర్‌ వేసినట్లు తెలిపారు.

ఐతే.. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన కథనం మరోలా ఉండడంతో ఏదో జరిగిందనే అనుమానాలు బలపడ్డాయి. అటు, యాక్సిడెంట్‌లో కొడుకును కోల్పోవడంతోపాటు గాయాల పాలైన మహిళ నిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ అక్కడి నుంచి ఉన్నట్టుండి అదృశ్యమైంది. ఆమె ఎందుకు చికిత్స వద్దని వెళ్లిపోయింది…. ఎవరైనా బెదిరించారా లేదంటే డబ్బులతో సెటిల్మెంట్‌ చేశారా అనే సందేహాలూ వచ్చాయి.

ఇదంతా మీడియాలోను, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవడంతో పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది. చివరికి అన్ని ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌లు పరిశీలించి కారు నడిపింది ఎవరు, ఏం జరిగింది అనే దానిపై ఒక అంచనాకు వచ్చారు. స్టీరింగ్‌పై ఫింగర్‌ ప్రింట్స్‌ కూడా చెక్‌ చేసుకున్న తర్వాత ప్రమాదానికి అఫ్నానే కారణంగా నిర్థారించారు.

Tags

Read MoreRead Less
Next Story