TG : ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన జడ్జి

నల్గొండ జిల్లా మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న ఆదివారం రాత్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. కొత్తగూడెంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన న్యాయవాది శాంత కుమార్తె అయిన స్వప్నకు మిర్యాలగూడ మండలం నిడమనూరుకు చెందిన దాసరి కార్తీక్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లా మున్సిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న స్వప్న.. ప్రసవం కోసం కొత్తగూడెంలోని పుట్టింటికి వచ్చారు. ఉన్నత విద్యనభ్యసించి, న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆమె.. కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నా సామాన్య ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేరగా ఆదివారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకోవాలని, పూర్తి నమ్మకంతో వైద్యం పొందాలని సూచించారు. తనకు వైద్యసేవలందించిన డాక్టర్ సాగరిక, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com