జీవన్ రెడ్డిపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ లో భిన్నాభిప్రాయాలు..?

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా జీవన్ రెడ్డి చుట్టూ తిరిగిపోతున్నాయి. చాలా కాలం తర్వాత జీవన్ రెడ్డి పేరు తెలంగాణలో మార్మోగిపోయింది. కారణం జీవన్ రెడ్డి కోసం కేసీఆర్ సభ పెట్టడం. ఇప్పటి వరకు కేసీఆర్ ఏ నాయకుడి కోసం ఇలా బహిరంగ సభ పెట్టలేదు. అలాంటిది జగిత్యాలలో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన లీడర్ కోసం సభ పెట్టడం ఏంటో కేసీఆర్ కే తెలియాలి. అది కాస్త పక్కన పెడితే.. జీవన్ రెడ్డిని చేర్చుకోవడంపై బీఆర్ ఎస్ లోనే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో రెండుసార్లు కేసీఆర్ మీద పోటీ చేసి ఓడించాలని చూసింది జీవన్ రెడ్డినే. కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమం లేకుండా పోతుందని కాంగ్రెస్ భావిస్తే.. అందుకోసం కేసీఆర్ మీదనే పోటీ చేశారు జీవన్ రెడ్డి. పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే చాలు తెలంగాణ ఎందుకు అని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడిన జీవన్ రెడ్డికి అంత ప్రాముఖ్యత ఎందుకు అని బీఆర్ ఎస్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.
పార్టీ కోసం ఎంతో మంది పదవులు త్యాగం చేసి కష్టపడుతుంటే.. అలాంటి వారిని పక్కన పెట్టేసి జీవన్ రెడ్డికి వచ్చీ రాగానే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం ఏంటని అడుగుతున్నారు. ఇంకో వర్గం మాత్రం మనుషులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండరని.. పద్ధతులు మార్చుకున్నప్పుడు పార్టీలోకి తీసుకుంటే తప్పేంటని అడుగుతున్నారు. అటు కాంగ్రెస్ లోనూ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చినా.. వదిలేసి వెళ్లిన జీవన్ రెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు.
కానీ ఇంకొందరు మాత్రం.. జీవన్ రెడ్డి పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారని.. అలాంటి నిఖార్సైన లీడర్ ను కాపాడుకుంటే బాగుండేదని చెబుతున్నారు. ఇలా కాంగ్రెస్, బీఆర్ ఎస్ లో జీవన్ రెడ్డి సెంట్రిక్ గా రాజకీయాలు ఎందుకు అని అడిగే వారు కూడా ఉన్నారు. జీవన్ రెడ్డి వల్ల బీఆర్ ఎస్ కు ఏం లాభం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. మరి జీవన్ రెడ్డి ఏ స్థాయిలో పార్టీని ఉత్తర తెలంగాణలో నడిపిస్తారో వేచి చూడాల్సిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
