Warangal : కడియం vs రాజయ్య... ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ రగడ...

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ రగడ తారా స్థాయికి చేరుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్‌ఎస్ నాయకుడు తాటికొండ రాజయ్య , మరో నేత కడియం శ్రీహరి మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. పార్టీ మారిన కడియం పై తీవ్ర విమర్శలు చేశారు రాజయ్య. "మగాడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్" అంటూ కడియంకు సవాలు విసిరారు రాజయ్య. వరంగల్ గడ్డ పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చేసి, ఏ పార్టీలో ఉన్నావో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరికి ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోవడానికి కూడా సిగ్గు లేదని, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారని రాజయ్య మండిపడ్డారు. తన కూతురు కోసం కడియం పార్టీ మారి, ఏకంగా రూ. 200 కోట్లకు అమ్ముడుపోయాడని రాజయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ వెంటనే స్పందించి కడియం శ్రీహరిపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా తాజా విమర్శలతో కడియం వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఈరోజు రఘునాథపల్లిలో మీడియా సమావేశం నిర్వహించేందుకు రాజయ్య ప్రయత్నించగా, పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు ఆయనను నివారించారు. అయినప్పటికీ రాజయ్య వినకపోవడంతో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మాటల యుద్ధం నేపథ్యంలో, రఘునాథపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజయ్య హౌస్ అరెస్ట్ తో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. కాగా ఈ వ్యవహారం పోలీసులకు తల నొప్పిగా మారింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com