Telangana News : అన్నారం బ్యారేజీ చుట్టూ రాజుకున్న వివాదం..

Telangana News : అన్నారం బ్యారేజీ చుట్టూ రాజుకున్న వివాదం..
X

తెలంగాణలో మళ్లీ ప్రాజెక్టుల చుట్టూ వివాదాలు క్రియేట్ అవుతున్నాయి. మొన్నటి దాకా గోదావరి, కృష్ణా జలాల నీటి పంపకాల చుట్టూ వివాదం ఎంత పెద్ద ఎత్తున రాజుకుందో మనందరికీ తెలిసిందే. అది కాస్త చల్లబడుతుందన్న సమయంలో.. ఇప్పుడు తెలంగాణలో మరో వివాదం ముదురుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీ పిల్లర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని.. దాని వల్ల ప్రాజెక్టుకే ప్రమాదం అని బీఆర్ ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి ఇసుకను పెద్ద ఎత్తున అమ్ముకుంటోందని.. వందల కోట్ల స్కామ్ జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు బీఆర్ ఎస్ నేతలు. దాని వల్ల ప్రాజెక్టు కుంగిపోతే.. ఆ నింద తమ మీద వేయడానికి కుట్ర చేస్తున్నారంటూ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దానిపై అటు కాంగ్రెస్ నుంచి కూడా బలమైన వాదనలే వినిపిస్తున్నాయి.

అన్నారం బ్యారేజీ బీఆర్ ఎస్ హయాంలోనే కుంగిపోయిందని.. దానికి టెక్నికల్ పరీక్షలు నిర్వహించాలంటే నీరు, ఇసుక ఉండొద్దని పూణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సంస్థ తెలిపిందని అంటున్నారు. టెక్నికల్ టెస్టులు నిర్వహించాలంటే పిల్లర్ల చుట్టూ పేరకుపోయిన ఇసుకను కచ్చితంగా తవ్వాలని.. అందుకే నీటి పారుదల శాఖ అధికారుల సమక్షంలోనే ఏజెన్సీలు ఇసుకను తొలగిస్తున్నాయంటూ తెలిపాయి ప్రభుత్వ వర్గాలు.

ఈ విషయంపై బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు వాదనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అంటేనే స్కాములు అని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తుంటే.. బీఆర్ ఎస్ వల్లే కాళేశ్వరం కుంగిపోయిందని.. లక్ష కోట్లు దోచేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా ఇరు పార్టీలు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

Tags

Next Story