Konda Surekha : కాంగ్రెస్ అధిష్టానానికి కాళేశ్వరం ప్రసాదం

కాళేశ్వరంలో మూడు రోజుల పాటు నిర్వహించిన మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రసాదాన్ని, త్రివేణి సంఘమ జలాలను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ నేతలకు పంపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర, ముక్తీశ్వర దేవాలయంలో ఈనెల 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు మహాకుంభాభిషేకం జరిగింది. 42 సంవత్సరాల తర్వాత నిర్వహించిన ఈ కుంభాభిషేకంలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ముక్తీశ్వరస్వామి ప్రసాదాన్ని, ప్రతిమలను, గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల జలాలను మంత్రి సురేఖ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్లకు మంగళవారం ప్రత్యేకంగా పంపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు రోజుల పాటు త్రివేణి సంఘమం వద్ద మహాకుంభాభిషేకం విజయవంతంగా జరిగిందని ఆమె ఏఐసీసీ నేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 42 సంవత్సరాల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించినట్లు మంత్రి సురేఖ లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం, ముక్తీశ్వరాలయంలో 1982లో మహాకుంభాభిషేకం జరిగిందని, ఆ తర్వాత ప్రజాపాలనలో కుంభాభిషేకం నిర్వహించడం ఎంతో గొప్ప అవకాశం కలిగిందన్నారు. ఈ కుంభాభిషేకం కార్యక్రమంలో శృంగేరి జగద్గురువులు భారత తీర్ధమహాస్వామి, విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి, తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానందస్వామి పాల్గొన్నారని మంత్రి సురేఖ ఏఐసీసీ నేతలకు పంపిన లేఖలో గుర్తుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com