Kamareddy : క్లిష్టంగా మారిన కామారెడ్డి డెత్ కేసు.. కీలకంగా మారిన ఫోన్ కాల్స్, వాట్సప్ చాటింగ్

కామారెడ్డి జిల్లాలోని చెరువులో ఇద్దరు యువకులు, ఓ యువతి సూసైడ్ చేసుకున్న కేసులో ఘటనాస్థలంలో దొరికిన సెల్‌ఫోన్లే కీలకంగా మారాయి. ముగ్గురి కాల్‌డేటా, వాట్సప్ చాటింగ్‌ను పరిశీలిస్తున్నారు. శ్రుతి, నిఖిల్‌ల మధ్య ఆత్మహత్యపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటే... నేను చేసుకుంటానని... కాదు కాదు ఇద్దరం కలిసే చేసుకుందాం అంటూ ఇరువురి మధ్య బలవన్మరణంపై చాటింగ్ ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు ఎస్సైతో సైతం పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎస్సైకి చెందిన మూడు సెల్‌ఫోన్లలో రెండు అన్‌లాక్ కాలేదని, అన్‌లాక్ అయిన మరో ఫోన్‌లోని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు శుక్రవారం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. అయితే సాక్షులు, ఆధారాలు లేకపోవడంతో ఏమీ తేల్చలేకపోయారు. ఇవాళ మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ముడిపడి ఉన్నాయా అనే కోణంలోనూ ముగ్గురి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. లాకర్‌లను తెరిచి పరిశీలించేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరారు. 2018 బ్యాచ్ పోలీసుల నుంచి ఎస్సై సాయికుమార్ నడవడికపై వివరాలు సేకరిస్తున్నారు. ఆయన భార్య మహాలక్ష్మి, తల్లిదండ్రుల వాంగ్మూలాలను సేకరించడానికి మెదక్ జిల్లా కొల్చారానికి ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు. శ్రుతి, నిఖిల్‌ల తల్లిదండ్రులు, బంధువులతోనూ మాట్లాడనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com