Kavitha : కవితకు మళ్లీ నిరాశ.. కేటీఆర్ భావోద్వేగం

బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. సుప్రీంకోర్టులో కవిత తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆమె పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి ఈ నెల 23 (శుక్రవారం) వరకు సుప్రీంకోర్టుకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
దీంతో.. బీఆర్ఎస్ లో మళ్లీ ఎదురుచూపులే దిక్కయ్యాయి. మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భావోద్వేగమైన ట్వీట్ చేశారు. తీహార్ జైల్లో ఉన్న తన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గుర్తు చేసుకుని కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఎక్స్ వేదికగా కవిత ఫోటోలతో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ' ఈరోజు నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ నీకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉంటా' అని ట్వీట్ చేశారు.
గతంలో సోదరి కవిత తనకు రాఖీ కట్టిన ఫోటోలు షేర్ చేశారు. కాగా నెట్టింట ఈ ట్వీట్ వైరల్ గా మారింది. నెటిజన్లు సైతం అవేదన వ్యక్తంచేశారు. మేమంతా మీ వెంటే ఉన్నామని కేటీఆర్ అభి మానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, లిక్కర్ స్కాం వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com