Kavitha : కుట్రపూరితంగానే తొలగించారు.. TBGKS పదవిపై కవిత రియాక్షన్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి షాక్ ఇచ్చింది. ఆమె అమెరికా పర్యటనలో ఉన్న టైంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి నుండి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘం గా పని చేస్తున్న ఈ యూనియన్ గౌరవ అధ్యక్ష బాధ్యతలను కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించింది. గత పదేళ్లుగా కవిత TBGKS గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. నివురు గప్పిన నిప్పులా గత కొంత కాలంగా అన్నా చెల్లెళ్ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు తాజా నిర్ణయంతో మరోసారి తెర మీదకు వచ్చింది.
ఇక ఈ అంశంపై తాజాగా స్పందించారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆమె.. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పదేళ్ల పాటు వారికి సేవ చేసుకునే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పదేళ్ల కాలంలో ప్రతి కార్మిక కుటుంబానికి ఒక సోదరిగా సేవలు అందించానని.. పదవిలో ఉన్నా లేకున్న కార్మికుల సమస్యల పరిష్కారంలో తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో కుట్ర పూరితంగానే ఈ ఎన్నిక జరిగిందని అభిప్రాయపడ్డారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పార్టీ ఆఫీస్ లో ఎన్నికను నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కాగా కార్మిక సంఘం లో కీలక సభ్యులుగా ఉన్న పలువురు జాగృతి నేతలు సైతం రాజీనామా చేసారు. కాగా ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com