కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అంశంపై రగడ

తెలంగాణలో కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అంశం కాక రేపుతుంది. దీంతో బీజేపీని టార్గెట్ చేశాయి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు. ఈ ఫ్యాక్టరీకి అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో అధికార టీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీ కోసం భూమి సేకరించి ఇచ్చినా.. కేంద్రం హామీని నిలబెట్టుకోకపోవడం సరికాదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. తమ హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. పార్లమెంట్‌లో ఈ విషయంపై నిలదీస్తామన్నారు కేటీఆర్. ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం.. ఇప్పుడు కాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని చెప్పడం ప్రజలను మోసగించడమేనన్నారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్. ఫ్యాక్టరీయే అవసరం లేదని బీజేపీ అనడం దారుణమన్నారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం పోరాటానికి సిద్ధమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి. ప్రైవేటీకరణ చేయడం కోసమే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మించడం లేదని ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్‌ను టీఆర్ఎస్ అడగదు.. బీజేపీ ఇవ్వదని ఎద్దేవా చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలోనైనా పోరాటానికి సిద్ధమన్నారు ఉత్తమ్.
టీఆర్‌ఎస్ విమర్శలను తిప్పి కొట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 2014 నుంచి కేంద్రం.. లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. అందుకే కోచ్ ఫ్యాక్టరీ వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిందన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com