KCR: ప్రజాకర్షకంగా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో

తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రజల్ని ఆకట్టుకునే హామీలతో గులాబీ దళపతి కేసీఆర్ బీఆర్‌ఎస్ మేనిఫేస్టో ప్రకటించారు. 93లక్షల BPL కుటుంబాలకు KCR బీమా పేరుతో 5లక్షల రూపాయల బీమా చేయిస్తామని హామీ ఇచ్చారు. రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం, నిరుపేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరిట నెలకు 3వేల సాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. దశలవారీగా ఆసరా పింఛన్లు 5వేలు, దివ్యాంగుల పింఛన్లు 6 వేలు, రైతు బంధు 16 వేలు చేస్తామని, పేదలకు గ్యాస్ సిలిండర్ 4వందలకే అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 15లక్షల చేస్తామని KCR భరోసా ఇచ్చారు. ప్రజాకర్షక హామీలతో ఓటర్లను ఆకట్టుకునే పథకాలకు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చోటు కల్పించారు. మళ్లీ తమ సర్కారే వస్తుందన్న KCR...ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగించడంతో పాటు.. కొత్త హామీలను సైతం ఆరు నెలల్లోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా పేరిట.. పేదల కోసం 5లక్షల రూపాయల విలువైన కొత్త బీమా పథకాన్ని తీసుకొస్తామని తెలిపారు. రైతు బీమా తరహాలోనే L.I.C ద్వారా అమలు చేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆసరా పింఛన్లను దశల వారీగా 5 వేల 16 రూపాయలకు పెంచుతామని KCR హామీ ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్లు 6 వేలు చేస్తామన్నారు. తెలంగాణోలని ప్రతి పేద మహిళకు సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట ప్రతినెల 3 వేలు ఇస్తామని కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారు. పేదలతో పాటు అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టులకు 400కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని కేసీఆర్ తెలిపారు. రైతు బంధు సాయం మొత్తాన్ని దశలవారిగా ఏడాదికి ఎకరాకు 16వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీలను యథాతథంగా కొనసాగిస్తామన్నారు.
ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి 15లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజీ, వరంగల్‌లో అతిపెద్ద ఆస్పత్రి, నిమ్స్ విస్తరణ, హైదరాబాద్ నలమూలల దవాఖానాలతో వైద్యరంగంలో విప్లవం వచ్చిందన్నారు. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు సైతం ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యసేవలు అందించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇళ్లు లేని పేదలకు అందరికీ సొంత జాగాలు ఇవ్వడంగానీ, రెండు పడక గదుల ఇళ్లు అందించడం చేస్తామని కేసీఆర్ వివరించారు. హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్ ఇళ్లను నిర్మించి అందిస్తామన్నారు. దళిత బంధు, రైతు బీమా, గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కొనసాగుతాయని భారాస మేనిఫేస్టోలో హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములు క్రయవిక్రయాలు చేసుకునేలా హక్కులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బీసీ, ఎస్టీ, మైనార్టీల మాదిరిగానే అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అనాథల కోసం ప్రత్యేక పాలసీని తెస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను తెచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com