KCR: హ్యాట్రిక్‌ విజయం ఖాయం: కేసీఆర్‌

KCR: హ్యాట్రిక్‌ విజయం ఖాయం: కేసీఆర్‌
తెలంగాణలో అభివృద్ధి ఆగదన్న కేసీఆర్‌...గజ్వేల్‌ నేతలతో విస్తృత స్థాయి సమావేశం

తెలంగాణలో అభివృద్ధి ఆగదు ప్రగతిపథంలో ఇంకా ముందుకు సాగుదామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గతంలో ప్రజలను దశాబ్దాలుగా పట్టిపీడించిన కరెంట్‌ బాధలు, తాగునీటి కష్టాలను స్థిరమైన ఆలోచనతో తీర్చామని కేసీఆర్‌ వివరించారు. మేడ్చల్ జిల్లా తూంకుంట వద్ద బీఆర్‌ఎస్‌ గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, వంటేరు ప్రతాపరెడ్డి, రఘోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తొలిదశ ముగిసిందని.. ఈసారి గెలిపిస్తే మరో విడత ప్రగతికి శ్రీకారం చుడతామన్నారు. ఇకపై గజ్వేల్‌ నియోజకవర్గానికి ప్రతీనెలా ఓ రోజూ కేటాయిస్తానని కేసీఆర్‌ హామీఇచ్చారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఖాయమని KCR పునరుద్ఘాటించారు. 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగు, తాగు, విద్యుత్‌ సమస్యలకు పరిష్కరించుకున్నామని తెలిపారు. గజ్వేల్‌ను దేశంలోనే ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని సీఎం స్పష్టం చేశారు.


గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ఇల్లు లేకుండా ఏ పేదవాడు ఉండొద్దనేదే తన లక్ష్యమని KCR ప్రస్తావించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి చరిత్ర పుటల్లో నిలుపుదాం అని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తించారు. గజ్వేల్‌తోపాటు ముఖ్యమంత్రిగా KCR హ్యాట్రిక్ కొట్టాలని.. అందుకోసం కార్యకర్తలు, శ్రేణులు కృషి చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. గజ్వేల్‌లో చేసిన అభివృద్ధి అంతా ప్రజల కళ్లముందే ఉందని వివరించారు.

మళ్లీ సీఎం హోదాలో తొలి సమావేశం ఈ హాలులోనే ఏర్పాటు చేసి పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర పనులకు సంబంధించి విస్తృతంగా చర్చించి బ్లూప్రింట్ తయారు చేద్దామని స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో సంతృప్తి పడొద్దని.. చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. ఒక విడత మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయి.. గజ్వేలులో రెండో విడతలో మరింత అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు. గజ్వేల్‌ను వదిలిపెట్టి పోయేది లేదని.. ఎంత మెజార్టీతో గెలిపిస్తారనేది ప్రజల దయ అన్నారు. కామారెడ్డిలో పోటీ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయని పార్టీ నేతలకు వివరించారు.

Tags

Next Story