KCR: కేసీఆర్ ఢిల్లీ పర్యటన పూర్తి.. థర్డ్ ఫ్రంట్‌పై త్వరలో..

KCR (tv5news.in)

KCR (tv5news.in)

KCR: ప్రత్యామ్నాయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు సీఎం కేసీఆర్.

KCR: ప్రత్యామ్నాయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు సీఎం కేసీఆర్. దేశానికి సరైన దిశ చూపేలా గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జార్ఖండ్‌ సీఎం సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ను కలిశారు. ప్రాంతీయ పార్టీల సత్తా ఏంటో చూపుదామంటూ సోరెన్‌ కామెంట్ చేశారు. స్వాతంత్ర భారతంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని, ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌ చాలా అంశాల్లో వెనకబడి ఉందన్నారు సీఎం కేసీఆర్.

సరికొత్త భారత్‌ను నిర్మించడంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కోరుతున్నామని, అందుకే ఇది మూడో ఫ్రంటో, నాలుగో ఫ్రంటో కాదన్నారు కేసీఆర్. దేశంలోని పలు పార్టీలను, పలు సంఘాల నేతలు, రైతు నాయకులను కలుస్తున్నాని.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తయారుచేయడం కోసం అందరి పాత్ర కోరుతున్నామన్నారు. మెరుగైన భారత్‌ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందజేయాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు.

ఇప్పటి వరకు ఏ ఫ్రంట్‌ పురుడుపోసుకోలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్. ప్రత్యామ్నాయ ఫ్రంట్‌పై త్వరలోనే స్పష్టత ఇస్తామన్న కేసీఆర్.. తమ ఫ్రంట్‌ ప్రయత్నాలు బీజేపీకి వ్యతిరేకం కాదని, అలాగే కాంగ్రెస్‌కూ వ్యతిరేకం కాదంటూ మరో సంచలన ప్రకటన చేశారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని సరైన పంథాలో నడిపించడం లేదని, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందని అన్నారు.

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. పలు పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులను కలుస్తారంటూ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ప్రధానంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికే హస్తినకు వెళ్లారని చెప్పుకున్నారు. కాని అనూహ్యంగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ను కలిసొచ్చారు. సుబ్రమణ్యస్వామి మినహా కేజ్రీవాల్‌ను గాని ఇతర జాతీయ పార్టీ నాయకులను గాని కలవలేదు సీఎం కేసీఆర్.

ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తోందన్నారు. ఏడున్నరేళ్లుగా తెలంగాణకు ఎలాంటి సాయం చేయడం లేదని, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. చివరికి రైల్వేలోనూ సహాయ నిరాకరణ చేస్తోందని, కరోనా టీకాలు, వలస కూలీలకు సాయంలో కేంద్రం విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని, బీజేపీకి తగిన శాస్తి జరగాల్సిందేనన్నారు.

Tags

Next Story