KCR: మోదీ హైదరాబాద్‌ పర్యటనకు దూరంగా కేసీఆర్‌.. ప్రోటోకాల్‌కు విరుద్దమంటూ..

KCR: మోదీ హైదరాబాద్‌ పర్యటనకు దూరంగా కేసీఆర్‌.. ప్రోటోకాల్‌కు విరుద్దమంటూ..
X
KCR: దేశవ్యాప్తంగా మరో చర్చను లేవనెత్తారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు ఆయన దూరంగా ఉన్నారు.

KCR: దేశవ్యాప్తంగా మరో చర్చను లేవనెత్తారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు ఆయన దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సావాలు, ఇక్రిశాట్ 50 యేళ్ల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని విచ్చేశారు. సరిగ్గా దానికి కొన్ని నిమిషాల ముందే ప్రధాని పర్యటనకు కేసీఆర్‌ వెళ్లడం లేదన్న అధికారిక సమాచారం వచ్చింది.

దీంతో అందరి ఫోకస్‌ ఒక్కసారిగా కేసీఆర్‌ గైర్హాజరుపైకే వెళ్లింది. ప్రధానికి ఎయిర్‌పోర్టులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. అయితే.. సీఎం కేసీఆర్‌ స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతోనే వెళ్లలేకపోయినట్లు సమాచారం వచ్చింది. గురువారం ముచ్చింతల్‌ వెళ్లి ఏర్పాట్లను చూసి వచ్చారు కేసీఆర్‌.

షెడ్యూల్‌ ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ శంషాబాద్‌లో ప్రధానికి స్వాగతం పలికి ఇక్రిశాట్‌కు వెళ్లాల్సి ఉంది. కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. కారణాలు ఏమైనా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉండటంపై చర్చ జరుగుతోంది.

ఇటీవలి కాలంలో కేంద్రంపై, బీజేపీపై యుద్ధం ప్రకటించారు కేసీఆర్‌. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ తర్వాత సీఎం కేసీఆర్ మరింత దూకుడు ప్రదర్శించారు. రెండున్నర గంటలపాటు ప్రెస్‌మీట్‌ పెట్టి కేంద్ర విధానాలను తూర్పారబట్టారు. ఇప్పుడు దానికి కంటిన్యూగానే ప్రధాని టూర్‌కు దూరమయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లకపోవడాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. ప్రోటాకల్‌కు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షేమ్ ఫుల్ అంటూ బీజేపీ నేతలు సోషల్ మీడియాలో ట్వీట్ చేసి విమర్శలు కురిపించారు. దేశ ప్రధాని హైదరాబాద్‌కు వస్తే.. కలిసేందుకు సీఎం కేసీఆర్‌కు తీరికలేదా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

అస్వస్థత కారణంగా ఎయిర్‌పోర్టుకు రాలేకపోయానని చెప్పడం కుంటిసాకులే అని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అనేక సార్లు ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌కు.. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారని బండి సంజయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రధాని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తే సీఎం వెళ్లాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రోటోకాల్ సైతం ఇదే చెబుతోందని వివరించింది. దీనిపై బీజేపీ నేతలు రాజకీయం చేయడం తగదని హితవు పలికింది. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ ఒకే వేదిక పంచుకుని దాదాపు ఆరేళ్లు అవుతోంది. చివరిసారిగా 2016లో గజ్వేల్‌లో మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇరువురూ పాల్గొన్నారు.

కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. 2020 నవంబర్‌లో మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. కానీ కరోనా వ్యాప్తి, ఇతర పరిస్థితుల నేపథ్యంలో.. హాకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో విమానం దిగిన మోదీ.. నేరుగా భారత్‌ బయోటెక్‌ పరిశ్రమకు వెళ్లారు. కోవిడ్‌ వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలతో మాట్లాడి అట్నుంచే తిరిగి వెళ్లిపోయారు.

Tags

Next Story