KCR: విపక్ష నేతల మీటింగ్‌కు దూరంగా కేసీఆర్..? ఆయన స్థానంలో వారిని పంపి..

KCR: విపక్ష నేతల మీటింగ్‌కు దూరంగా కేసీఆర్..? ఆయన స్థానంలో వారిని పంపి..
KCR: రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఏం చేస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

KCR: రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఏం చేస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై రేపు 22 విపక్ష పార్టీల నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు మమత బెనర్జీ. దీంతో రేపటి ఢిల్లీ మీటింగ్‌కు సీఎం కేసీఆర్‌ హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సమావేశానికి రావాలంటూ సీఎం కేసీఆర్‌కు మమత బెనర్జీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు కూడా. అయితే, బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేందుకు జాతీయ పార్టీని తెరపైకి తీసుకొస్తున్న కేసీఆర్.. ఇప్పుడీ మీటింగ్‌కు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తే లాభనష్టాలేంటనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారన్న చర్చ జరుగుతోంది. పైగా ఈ సమావేశానికి కాంగ్రెస్‌ను కూడా ఆహ్వానించారు కాబట్టి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లకపోవచ్చని మాట్లాడుకుంటున్నారు. నిన్న ప్రశాంత్ కిషోర్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో ఢిల్లీ సమావేశంపై సుదీర్ఘ చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. జాతీయ పార్టీ పెడుతున్న ఈ తరుణంలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలని, అందుకే పలువురితో సంప్రదింపులు చేస్తున్నారని చెబుతున్నారు.

అయితే, మమత బెనర్జీ స్వయంగా ఫోన్ చేసిన కారణంగా.. పార్టీ తరపున టీఆర్‌ఎస్‌ ప్రతినిధులను పంపించే ఆలోచన కూడా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కేసీఆర్‌కు కూడా ఆసక్తి ఉన్నందున.. ఈ సమావేశానికి ప్రతినిధులను పంపించొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి మమత బెనర్జీ సారథ్యంలోని సమావేశం తరువాత సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని, వాటిని మీడియాకు వివరిస్తారని చెప్పుకుంటున్నారు. రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలోనూ మమత మీటింగ్‌ తరువాత క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్.

Tags

Read MoreRead Less
Next Story