KCR : పంచాయతీల్లో కేసీఆర్ రోడ్లు మరిచారు.. రేవంత్ సెటైర్లు

KCR : పంచాయతీల్లో కేసీఆర్ రోడ్లు మరిచారు.. రేవంత్ సెటైర్లు
X

రాష్ట్రంలోని గిరిజన తండాల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రకటించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో తాగు నీటితో పాటు మౌళిక వసతులు లేని తండాలు ఎన్నో ఉన్నాయని, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఐటీడీఏ ప్రాంతాల్లో తండాల పరిస్థితిని వివరించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుపోవాలని సూచించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తండాల పరిస్థితిపై కాంగ్రెస్ సభ్యులు జాటోత్ రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, చిక్కుడు వంశీకృష్ణ అడిగిన ప్రశ్నలకు జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేరుకే గిరిజన ఆవాసాలను గ్రామ పంచాయితీలుగా గుర్తించారు తప్ప వాటికి మౌళిక వసతులు కల్పించాలనే విషయం మరచిపోయారని విమర్శించారు రేవంత్.

తన నియోజకవర్గమైన బొమ్మరాసిపేట మండలంలో 72 తండాలను గ్రామపంచాయితీ(జీపీ)లుగా మార్చినప్పటికీ అవసరమైన వసతులు కల్పించలేకపోయారని ఆరోపించారు. పాఠశాలలు, రహదారులు లేకపోయినప్పటకీ జీపీ హోదా ఇచ్చారని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం తండాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తుందని, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. తండాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు తారు రోడ్డు, జిల్లా కేంద్రాల నుంచి రాజధాని హైదరాబాద్ వరకు నాలుగు వరుసల బీటీ రోడ్డు వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

హరీష్ రావుతో పాటు ఆ పార్టీ సభ్యులను అదిలాబాద్ లోని ఐటీడీఏ తండాలకు తీసుకువెళ్లి పరిస్థితిని వివరించాలని రాష్ట్ర పంచాయతిరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను కోరారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరించినందుకే ప్రజలు ఆ పార్టీని శిక్షించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, అయినప్పటికీ మారటం లేదని సీఎం అన్నారు.

Tags

Next Story